Friday, July 6, 2018

తిరుమలలో ఆవిర్భవించిన కొన్ని ప్రముఖ దివ్య తీర్థాల గురించి తెలుసుకుందాం

ప్రస్తుతం తిరుమలలో ఆవిర్భవించిన కొన్ని ప్రముఖ దివ్య తీర్థాల గురించి తెలుసుకుందాం. 

1843లో ఆంగ్లేయులు తిరుమలను ఆలయ ధర్మకర్తలైన మహంతులకు అప్పగించే సమయంలో కొన్ని తీర్థాలను కూడా ప్రస్తావించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా చక్రతీర్థం, జాబాలి తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, రామకృష్ణ తీర్థం, సనకసనంద తీర్థం, పసుపుధారా తీర్థం, కుమారధారా తీర్థం, తుంబురు తీర్థం, శేష తీర్థం, గోగర్భ తీర్థం, వైకుంఠ తీర్థం. ఇంతే కాకుండా స్వామి పుష్కరిణి, స్వామి చెంత ప్రవహించే విరజాతీర్థం, ఆలయ ప్రాంగణంలోని బంగారుబావి, భూతీర్థం (పూలబావి), కటాహ తీర్థం (తొట్టి తీర్థం) - అనే మరికొన్ని తీర్ధాలున్నాయి. తీర్థాలకే తలమానికమైన స్వామి పుష్కరిణిలోనే మరో తొమ్మిది తీర్థాలున్నాయి. అవి వరాహ, ధనద,గాలవ, అగ్ని, వాయు, యమ, వశిష్ట, వరుణ, సరస్వతీ తీర్థాలు.

పేరుకు 108 పుణ్య తీర్ధాలున్నా, కాలాంతరంలో కొన్ని మూసుకుపోయాయి. మరికొన్ని కనుమరుగయ్యాయి. మనికొన్ని రూపుమాసిపోయాయి. శ్రీవారి ఆలయ పరిసరాలలోనే 54 తీర్థాల దాకా ఉండేవని ప్రతీతి. పూర్వం అనేకమంది మునులు, సాధువులు, ఋషులు వీటిచెంత కుటీరాలు, ఆవాసాలు నిర్మించుకుని జపతపాలు ఆచరించి స్వామిని సేవించేవారట.

తిరుమలలోని జల ప్రవాహాలు అలా అలా ప్రవహించి సెలయేళ్ళుగా, జలపాతాలుగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడి పరమశివుని శిరసున నటనమాడే గంగాభవాని సాక్షాత్కరిస్తుంది తిరుపతిలోని సుప్రసిద్ధ శైవాలయమైన కపిలతీర్థం. అలానే మరో పుణ్యతీర్థం తిరుచానూరులోని అమ్మవారి ఆలయ పుష్కరిణి పద్మ సరోవరం. దీన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే నిర్మించి శ్రీమహాలక్ష్మి కోసం తపస్సు ఆచరించాడని, అందువల్ల శ్రీమహాలక్ష్మి పద్మసంభవియై శ్రీమహావిష్ణువును చేరి పద్మావతిగా పేరుగాంచిందని మరో పురాణేతిహాసం తెలియజేస్తోంది. తిరుమల, తిరుపతి పుణ్యతీర్థాల్లో ప్రసిద్ధి చెందిన కొన్ని తీర్థాల గురించి తెలుసుకుందాం.

చక్ర తీర్ధం 

శ్రీవారి ఆలయానికి పశ్చిమంగా సుమారు 2 కిలోమీటర్ల దూరాన గల సహజ శిలాతోరణం పక్కన నెలకొని ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప తపోవనం. అనేకమంది సాధువులు, సిద్ధులు తపస్సు చేసుకునే గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకెక్కడా లేని విధంగా ఓ నిలువుపాటి బండపై చక్రత్తాళ్వారును, లక్ష్మీ నృసింహ స్వామిని చెక్కారు. కార్తీక బహుళ ద్వాదశినాడు తీర్థ ముక్కోటి. ఆనాడు తిరుమల ఆలయ అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో ఇక్కడికి వచ్చి పూజాపునస్కారాలు సల్పుతారు. స్కాంద పురాణాన్ని అనుసరించి శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు రాక్షసుడై సంచరిస్తూ పద్మనాభుడనే తపశ్శాలిని కబళించబోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన భక్తుని కాపాడేందుకు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించాడు. అందువల్ల దీనికి చక్రతీర్థం అనే పేరు స్థిరపడింది. అంతేకాక 130 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది అనుకున్న బంగారు బల్లికి (గోల్డెన్ గెకో) ఈ పరిసరాలే ప్రధాన స్థావరం కావడం విశేషం.




జాబాలి తీర్థం

జాబాలి మహర్షి తన శిష్యులటో కలిసి కొంతకాలం ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడు. శ్రీవారి ఆలయానికి ఉత్తరాన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పచ్చని వృక్షచ్చాయల నడుమ నెలకొని ఉందీ తీర్థం. హనుమజ్జయంతినాడు ఇక్కడ ఆలయంలో నెలకొన్న హనుమంతునికి విశేష పూజలు జరుగుతాయి. హాథీరాంజీ మఠంవారి అధీనంలోని ఈ తీర్థం గొప్ప మునివాటిక. ఈ తీర్థానికి కొంచెం ఎగువ సీతాకుంజ్ అనే చెరువు, ఆపైన ధ్రువుడు తపస్సు చేసిన ధృవతీర్థం ఉన్నాయి.

గోగర్భ తీర్ధం లేక పాండవతీర్థం

గోగర్భం డ్యాంకు దిగువన ఉన్నదే పాండవతీర్థం. కురుక్షేత్ర యుద్ధానంతరం తమకు అంటిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోడానికి పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. ఇక్కడి ఒక గుహలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కర్త మలయాళ స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. అందుకు చిహ్నంగా మలయాళ స్వామి పాలరాతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. దాపులోనే తిరుపతి క్షేత్రపాలక గుండు ఉంది. ఈ క్షేత్రపాలక గుండు పూర్వం ఆలయంలోని ధ్వజస్థంభం దగ్గర ఉండేది. ఒకనాడు ఈ క్షేత్రపాలక గుండు వల్ల ప్రమాదం జరిగింది. అందువల్ల దీన్ని ఆలయంనుండి తరలించి ఇక్కడ ఉంచడం జరిగింది. తిరుమల ఆలయ క్షేత్రపాలకుడు రుద్రుడు ప్రతిరోజూ ఆలయం తెరిచేటప్పుడు, తిరిగి మూసిన తర్వాత ఆలయ తాళాల గుత్తిని రుద్రపాలకుడైన క్షేత్రపాలక గుండుకు తాకించిన తర్వాతనే ఆలయాన్ని తెరవడం, మళ్ళీ ఆలయం మూసినా తర్వాత ఆలయ తాళాలను తాకించడం ఆలయ సంప్రదాయం.


మలయప్ప తీర్థం

పాపవినాశనం డ్యాం ముందు నుంచి తూర్పుగా దుర్గమమైన అడవిలో కొండల అంచున ప్రయాణించి ఈ తీర్థాన్ని చేరుకోవాలి. ఈ ప్రాంతాన్ని మైలపుకొనగా పిలుస్తారు. మాలిక్ కాఫర్ దక్షిణదేశ దండయాత్ర సందర్భంగా ఉత్సవ మూర్తులైన మలయప్పస్వామి వారిని ఈ తీర్థం వద్దనే చాలాకాలం పదిలపరచి ఉంచారని ప్రచారంలో ఉంది.

శేషతీర్థం

ప్రమాదాల నెలవు ఈ శేషతీర్థం. శ్రీవారి ఆలయానికి ఈశాన్యంగా ఐదు కిలోమీటర్ల దూరంలో దుర్గమమైన లోయలో నెలకొని ఉంది. వానాకాలంలో ఈ తీర్థసందర్శన అత్యంత ప్రమాదకరం. గంగమ్మగుడి నుంచి బయల్దేరి సానరాళ్ళ మిట్ట మీదుగా సామిరెడ్డి గుంతలు దాటి నడికటి గడ్డపై నడిచి ఎడంపక్క ఓ బావిలాంటి లోయలోకి దిగాలి. ఈత రానివారు ఈ తీర్థం చేరుకోడానికి ఏడు నీటి మడుగులు దాటాలి. చివరి దాంట్లో తప్పనిసరిగా నీటిలో ఈదాలి. వారి జీప్ ట్యూబుల సహాయంతో దాటవచ్చు. లోపల ఆదిశేషుడు చుట్టాలు చుట్టుకున్నట్లు అత్యద్భుత శిల్పాకృతి. ఇంకా లోనికి వెళ్తే వైకుంఠం నందలి పాలకడలి లాంటి అద్భుత సరోవరం. తటిల్లత మెరిసినట్లు ఒక జలపాతం ఆ జలకుండాన్ని నింపుతూ ఉంటుంది

రామకృష్ణ తీర్థం

ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుల శిలా విగ్రహాలున్నాయి. పాపవినాశనం డ్యాం నుంచి సనకనందన తీర్థం మీదుగా తుంబురు తీర్థం వెళ్ళే దారిలో కొద్ది దూరం పయనించాలి. సలీంద్రం బండ నుంచి ఎడమవైపు పెద్ద గుట్ట ఎక్కి ఓ లోయలోకి దిగాలి. పుష్య పౌర్ణమినాడు తీర్థ ముక్కోటి. సాధారణంగా ఫిబ్రవరిలో వస్తుంది. ఆ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు విచ్చేసి స్వామివార్లకు అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కుమారధార

ప్రస్తుతం ఇక్కడ తిరుమల యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు ఆనకట్ట నిర్మిస్తున్నారు. సాదర కౌగిలింతకై రెండు చేతులూ చాచినట్లు ఉంటుందీ తీర్థం. దాని ఉత్కృష్ట ప్రాకృతిక నిర్మాణం ఆంగ్ల సినిమా సెట్టింగును పోలి ఉంటుంది. పాపవినాశనం డ్యాం నుండి వాయువ్యంగా పాత చలివేంద్రం, అల్లికాలవ, టెంకెగుండు దాటితే కుమారధార, మాఘ పూర్ణిమ నాడు ముక్కోటికి జనం విశేష సంఖ్యలో దర్శిస్తారు. తారకాసునుని సంహరించిన తర్వాత కుమారస్వామి కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాడని కథనం. ఇక్కడ నిష్ఠగా జపతపాలు చేసి స్నానం ఆచరిస్తే సమస్త వ్యాధులు నిర్మూలమై, ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతారని భావిస్తారు. దగ్గర్లోనే ఉన్న పసుపుధారాతీర్థం, గణేశ ధారా తీర్థం గొప్ప ధార్మిక స్థలాలు.

తుంబురుతీర్థం

అత్యద్బుత ప్రాకృతిక నిర్మాణం. దీనికే ఘోణతీర్థం అని పేరు. తుంబురుడు తపస్సు చేసిన స్థలం కనుక దీనికి తుంబురుతీర్థం అనే ప్రశస్తి వచ్చింది. నారదునిచే తుంబురుడు శాపగ్రస్తుడైన తర్వాత ఆ తుంబురుడు ఇక్కడ తపస్సు చేసి ముక్తిని పొందిన కారణాన ఈ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. పాపవినాశనం డ్యాం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సనకసనందన తీర్థం, నల్లగుండాల మీదుగా వెళ్తే వచ్చే దట్టమైన అడవిలో నిండిన లోయలో తుంబురుకోన దర్శనమిస్తుంది.

భూపరిణామక్రమంలో భాగంగా ఓ పెనుకొండ కొబ్బరి చిప్పలా రెండు విచ్చుకుని దారి ఇచ్చినట్లు కనిపిస్తుంది. చివర్లో ఓ జలపాతం ఆ దోవగుండా ప్రవహిస్తూ మనల్ని పరవశుల్ని చేస్తుంది. స్వామివారి మహా భక్తురాలు తరిగొండ వెంగమాంబ కొంతకాలం ఇక్కడ గుహలో తపస్సు చేసింది. ఆమె పేరుతో ఇప్పటికీ ఆ గుహ తరిగొండ గవిగా పిలవబడుతోంది.

పులులు, ఎలుగుబంట్లు, కణుతలు, అడవిపందులు మొదలైన వన్యజంతువుల సంచార స్థలి, పాల్గుణపూర్ణిమనాడు తీర్థ ముక్కోటి తీర్థోత్సవం నాడు లక్షలమంది పైగా ఉత్సవం అత్యంత ప్రాముఖ్యత చెందింది. విశేష సంఖ్యలో తమిళులు దర్శించుకునే అత్యంత ప్రాముఖ్యత గల పుణ్యతటి. దగ్గరలోనే సన్యాసోళ్ళగవి, బూచోళ్ళపేట, చెంచమ్మ పేట అనే ప్రాంతాలు ఎంతో రమణీయంగా తారసపడతాయి.


నామాల గవి తీర్థం

స్టాలక్ టైట్లు, స్టాలక్ మైట్లు అనే సుద్ద గుహల సముదాయం, నీళ్ళు, గాలి, కోతులవల్ల వికోషీకరణం చెందిన కొండ శిలల వల్ల ఏర్పడిన ఉత్కృష్ట ప్రాకృతిక నిర్మాణం. నడక దోవలోని యోగనృసింహ ఆలయం నుంచి గానీ అవ్వాచారి కోన దగ్గరి పాత మెట్లదారి నుండి గానీ వెళ్ళవలసి ఉంటుంది. ఒకప్పుడు స్వామివారి తిరునామాన్ని ఈ సుద్దరాళ్ళతోనే తీర్చిదిద్దేవారట. ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా ఈ శిలాజం. నారాయణుని సేవకు నరులే కానక్కరలేదని తెలియచేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని బొర్రా గుహలకు పోలికగా ఉన్న ఈ నామాల గవి తప్పక చూడాల్సిన ప్రదేశం.

ఇక్కడికి దగ్గరలోనే గంటా మండపం ఉండేది. నడక దారిన ఉన్న ఈ గంటా మండపాలు పూర్వం చాలా ఉండేవి. తిరుమలరాయని నివేదనా కార్యక్రమాలను ఈ గంటానాదం ద్వారా చంద్రగిరిలోని రాజభవనంలో ఉన్న విజయనగర పాలకులైన అచ్యుతరాయలకు ఆలయ కార్యక్రమాలు తెలిసేవి. స్వామివారికి నివేదన అయిన తర్వాతనే అచ్యుతరాయలవారు భోజన కార్యక్రమాలకు ఉపక్రమించేవారని చరిత్రకారులు చెప్తారు. వీటిని అచ్యుతరాయలవారి కాలంలో నిర్మించారని తెలుస్తుంది. ఈ అచ్యుతరాయలవారే తన పట్టాభిషేకం స్వామివారి శంఖుతీర్థంతో అభిషిక్తులయ్యారట. తిరుమల క్షేత్ర విశేషాలు కోకొల్లలు. చదివేకొద్దీ చదవాలని, వేనికొద్దీ వినాలని తెలుసుకునేకొద్దీ తెలుసుకోవాలనే తపన, ఆత్రుత, ఆరాటం, ఉత్సుకత ఎంతని చెప్పగలం?! అదొక నిగూఢ విసేషాల మహానిది. అంతటి మహోన్నత నిధులమధ్య ఉన్నది శ్రీనివాసుని సన్ని 


స్వామి పుష్కరిణి

సమస్త తీర్ధాలకు స్వామి వంటిది కనుక దీన్ని స్వామి పుష్కరిణి అంటారు. అంతేకాదు స్వామి చెంత ఉన్నందున, ఇంకా ఆలయంలోని మూర్తిస్కందుడిగా భావించినందున దీన్ని స్కంద పుష్కరిణిగా పూర్వం భావించేవారు. తిరుమలలోని సమస్త తీర్థాల్లోని జలాలు ఈ పుష్కరిణిలోకి చేరతాయని, అందువల్ల ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్త పాపాలూ పోతాయని మరో విశ్వాసం కూడా ఉంది. ఈ పుష్కరిణిలో 9బావులున్నాయి. దీన్నే పూర్వం వరాహ పుష్కరిణి అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఈ పుష్కరిణి వరాహస్వామి ఆలయం చెంతన ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. పూర్వం దీనికి దాపునే మరో పుష్కరిణి ఉండేది. కొన్ని కారణాలవల్ల ఆ పుష్కరిణిని మూసివేసి భక్తులకొరకు వసతిగృహాలను నిర్మించారు. అందువల్లనే ఆ ప్రాంతాన్ని పాత పుష్కరిణి కాటేజీలు అని ఇప్పటికీ పిలుస్తున్నారు. తర్వాత ప్రస్తుత పుష్కరిణియే స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధమైంది.

ఆకాశ గంగ తీర్ధం

ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం


పాపనాశనం 

తిరుమల సర్వ పాపాలను తొలగించే పావన తీర్ధం తిరుమల లోని "పాపనాశన తీర్ధం".

ఈ తీర్ధం గురించిన ప్రస్తాపన స్కాంద పురాణంలో ఉన్నది. గతంలో ఈ నీటినే స్వామి వారి సేవలో ఉపయోగించేవారు.
ప్రస్తుతం ఆకాశ గంగ జలాలను వినియోగిస్తున్నారు.
పూర్వం అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రిందటి వరకూ ఇదొక కారడవి.

సూర్య కిరణాలు కూడా ప్రవేశించలేని దట్టమైన చెట్లతో కూడిన అడవి. నాకు బాగా గుర్తు.కొందరు ఆవి పుత్రులు రుద్రాక్షలు, పూసల దండలు, వన మూలికలు అమ్ముతుండే వారు.ఏ రకమైన సౌకర్యాలు లభించేవి కావు.కాల గమనంలో సప్తగిరుల మీద నీటి అవసరాలు పెరిగి పోవడంతో అన్నిటికన్నాపెద్దది ఐన ఈ జలపాతాల పైన ఆనకట్ట నిర్మించారు.

పూర్వం సహజం గా కొండల మీద నుంచి జాలువారే నీటి ప్రవాహాన్ని ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన పంపుల ద్వారా
విడుస్తున్నారు.భక్తులు ఆ ధారల క్రిందనే స్నానమాచారిస్తున్నారు.శ్రీ గంగా దేవి మరియు శ్రీ హనుమంతుని ఆలయాలను నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అద్వర్యంలోనియుక్తులైన బ్రాహ్మణులు శాస్త్ర ప్రకారం పూజలను జరిపిస్తున్నారు.
బస్సులు, అనేక ప్రెవేటు వాహనాలు లభిస్తాయి.

ఈ ఆనకట్ట దాటి అడవిలో ముందుకు వెళితే పసుపు ధార తీర్ధం, కుమార తీర్ధం, సనకసనందన తీర్ధం, శ్రీ రామ కృష్ణ తీర్ధం, తుంబుర తీర్ధం ఉంటాయి.ప్రశాంత ప్రకృతి తో మమేకం కావాలంటే తప్పక పాపనాశనం దర్శించాల్సినదే !!

కొన్ని ప్రత్యేక పర్వదినాలలో భక్తులను ఎ తీర్థాలను సందర్శించడానికి అనుమతిస్తారు.

ఓం నమో వేంకటేశాయ !!!



విరజానది

స్వామి పాదాలచెంత అంతర్వాహినిగా ప్రవహించే నది విరజానది. సమస్త జీవకోటినీ పరమపదాన్ని చేర్చే స్వామివారి పాదాల చెంత ప్రవహించే దేవనది ఈ విరజానది. స్వామి పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహిస్తున్న పరమపావన వాహిని ఈ విరజానది. శ్రీవారి సేవలో సకల చరాచర సృష్టి తరిస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. తరతరాలుగా తిరుమలపై వెలసిన శ్రీ వేంకటాచలపతి సేవలో తరించే చరాలు, అచరాలు ఎన్నో! అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. కోరినవారికి కొంగుబంగారం. కలడన్నవారి ఎదుట కన్నులెదుట మూర్తి. వెలయు శ్రీ వేంకటాద్రి విభుడితడు.


No comments:

Post a Comment